రాజశేఖర్ గుదిబండి(చంద్రం) ||తిరుగు
ప్రయాణం ...||
ఆకాశం లో సగం నువ్వు, అకాశమె హద్దు నీకు,
ఉరిమే ఉత్సాహం నువ్వు, అలసట లేని ప్రయాణం
నీది
ఎల్లలెరుగని ఆత్మవిశ్వాసం నీది, బాధ్యత నీది.
నీ రాక గ్రీష్మాన్ని పలకరించే వర్షపుజల్లు
చినుకుల్ని తడిమి పోయే సంతోషాల హరివిల్లు
*** *** ***
వెళ్లిపోవటం ఇక దగ్గరైనప్పుడు
గుండె , గడియారం జుగల్బంది మొదలవుతుంది
అమ్మ మనసు మళ్ళీ వర్షించే మేఘం అవుతుంది
నాన్న హృదయం నీరింకిన ఒయాసిస్సవుతుంది
కరిగి సంద్రమైన కాలం ఒడ్డున
ఎగిరిపడే జ్ఞాపకాల చేప పిల్లలు
నీ అడుగుల జలపాతాల వైపే చూస్తుంటాయ్
సప్త సముద్రాలు దాటి వచ్చి వాలేది
కొన్ని జ్ఞాపికల్ని ఇచ్చి పుచ్చుకోవటం కోసం
కాదు
కొన్ని జ్ఞాపకాల్ని పోగుచేసుకోవడానికి,
కొన్ని నిశబ్దాల్ని ఆలకించడానికి ,
కొన్ని గుండె శబ్దాల్ని సవరించడానికి
నువ్వు వచ్చి వెళ్ళటం పలకరింపు కోసం కాదు.
కొన్ని హృదయాల్ని కలిపి ఉంచడం కోసం
||
26.11.2013 ||
Comments
Post a Comment