|| నేను ప్రవహిస్తానెప్పుడో... ||



రాజశేఖర్ గుదిబండి (చంద్రం)  || నేను ప్రవహిస్తానెప్పుడో... ||

నేనో బొట్టుని !
బ్రతుకు బాటలో వ్యధల మూటతో
కృశించిన నశించిన బాటసారి గుండె కవాటాల
శబ్ద నిశ్శబ్దాల మధ్య ప్పున జారిపడ్డ
నెత్తుటి బొట్టుని !
చీకటి రక్కసి కబళించిన అబల
కడుపు చించుకొని జన్మనిచ్చిన అనాధ బిడ్డ
బొడ్డు కోసి రాల్చిన
తొలి నెత్తుటి బొట్టుని !

ధనిక పేద వ్యత్యాసానికి
కుల మతాల దౌర్జన్యానికి
తాళ లేక వేసారిన ప్రేమ జంట కళ్లల్లో
చిందిన కన్నీటి బొట్టుని !

రోజంతా ఒళ్లిరిచి గానుగలో ఎద్దులాగా
రెక్కలేమో ముక్కలైన చివరికేమో పీనుగైన
సగటు మనిషి పుడమిని తడిపే
చెమట బొట్టుని !

నేను ప్రవహిస్తానెప్పుడో
**       **       **
మీ దౌర్జన్యాలు , కులమత రాజకీయాలు, లైంగిక నిర్బంధాలు
మీ అవినీతి , అమానవీయ అసమానతలు ,
మీ కుళ్ళు , కాఠిన్యం
ఇంకా ఎన్నో ఎన్నెన్నో తుడిచేయడానికి,
కడిగేయడానికి
నేను ప్రవహిస్తానెప్పుడో

హిమ శిఖరాలు కరిగి కన్నీరైనట్లు
దిగంతాల స్వేదం  మేఖాలై జలపాతాలై ,
చిందిన రుధిరం చెలమలై ,సేలయేళ్ళై, ఉప్పెనై ప్రవహించినట్లు
నేను ప్రవహిస్తానెప్పుడో
ఉరుమై , మెరుపై , ఉత్తుంగ తరంగమై,
కోటి కలల అలలనై,

ప్రవాహమే దేహమై
దేహం ప్రవాహమై
నేను ప్రవహిస్తానెప్పుడో.

|| 04.03.1988 ||

Comments