॥నాయనమ్మ॥



రాజశేఖర్ గుదిబండి (చంద్రం) ॥నాయనమ్మ॥

తను కరిగి
వెలుగునిచ్చే కొవ్వొత్తి తెలుసు.
తను కరిగి జీవితాన్నిచ్చే,
తను కరిగి ప్రేమ నిచ్చే మనిషి తెలుసా నీకు?
కలల్నిచ్చి కలగా మిగలడం తెలుసా నీకు?

డబ్బుని ప్రేమించడం తెలుసు.
మట్టిని మనిషిగా ప్రేమించడం తెలుసా నీకు?
మట్టిలో మాణిక్యం తెలుసు.
విత్తుకి మొలకెత్తడం నేర్పి,
మొక్కకు తన శ్వాసనిచ్చి,
మట్టికి బంగారమద్దిన
ఒట్టి మట్టిమనిషి తెలుసా నీకు?
రక్తం చెమటగా మార్చటం తెలుసేమో నీకు,
చెమటను ప్రేమగా పంచడం తెలుసా?
కూరైన, నారైనా,
పాలైనా, పళ్ళైనా,
ప్రేమైనా,
పంచడమే కాని పంచుకోవడం తెలీని,
కన్నీటి దోసిళ్ళు తను మింగి,
అందమైన కలల్ని మనకు పంచే
మనిషి తెలుసా?
మాట రాని పసిబిడ్డను సాకటం తెలుసు.
నోరులేని పశువు ను బిడ్డలా ప్రేమించడం,
ప్రేమ పొందడం తెలుసా నీకు?
పశువు బాధ తెలుసా?
భాష తెలుసా నీకు?

మనిషిని పరీక్షించే అగ్ని తెలుసు.
నిప్పుని కూడా పరీక్షించే దేహం తెల్సా
నీ తరానికి ఆస్తి పంచటం తెలుసు,
తర తరాలకి తను వదిలిన జ్ఞాపకాలే ఆస్తని తెలుసా నీకు?

ఇవన్ని మాకు తెలిసొచ్చే లోపే
ఆ మనీషి
కలిసిరాని కాలంతో పోరాడి పోరాడి ఇక తనతో
కలసిరాని కాలాన్ని
మాకొదిలేసి వెళ్లి పోయింది....
౦౭.౦౬.౨౦౧౩.॥07.06.2013

Comments