|| నాగరికత..||





రాజశేఖర్ గుదిబండి (చంద్రం) || నాగరికత..||

20 శతాబ్దాల చరిత్ర శిశువు ని

21 వ శతాబ్దం లోకి రాకెట్లో వెళుతున్నా.

పుడుతూనే కన్న తల్లి చావు చూసా

కత్తుల పొత్తిళ్ళలో కళ్ళు తెరిచా

స్మశానంలో జరిగింది నా నామకరణం

సమాధులే నా పడకలు,

కపాలాలు నా ఆభరణాలు.

నైలు, సింధు నదీ శిధిలాలు

నా ఆట బొమ్మలు.

మొదటి యుద్ధం లో నా విద్యాభ్యాసం

రెండో యుద్ధానికి నా విద్యని సరిచూసుకున్నా

మూడో యుద్ధం లో ఉద్యోగానికి చూస్తున్నా

నా వాదం, సామ్రాజ్య వాదం

హింసా మార్గం నా వేదం.

నాగరికత నిషాదసంగీతాన్ని వింటున్నా

మధుబాలని , మడోన్నానీ కలిపే చూస్తున్నా

తాన్సేన్ ని రాకేన్రోల్ ని కలగలిపి వింటున్నా

సన్మానాలలో , కళ్యాణా లలో ,

స్మశానాలలో ఇక ఒకే రాగం వింటున్నా

నాగరికత రంగుటద్దాలు పెట్టుకున్నా

మీ మురికి ,ఆకటి చావులు, రక్తపు మడుగులు

మీ వేదనలు రోదనలు, చీకటి ఆక్రందనలు

మీ దుర్గంధాలు, స్వేదాలు, ఆయుక్షీణాలు,

మీ విప్లవాలు, శత సహస్ర ఉరికంబాలు,

నాకు సుప్రభాతాలు, హారతి పళ్ళేలు.


నాగరికత రంగులేసుకుంటున్నా.

కుక్కలు విస్తర్లు చించుకొంటుంటే,

జారిపడే మెతుకుల కోసం పిల్లలు వెతుక్కుంటుంటే,

ఒంటి పై గుడ్డలు ముక్కలుగా చీల్చుకుంటున్నా.

నగ్నంగా నర్తిస్తున్నా,

ఫైవ్ స్టార్ కటిక దుకాణం లో

నన్ను నేనే తెగనమ్ముకొంటున్నా.


నాగరికత బురఖాలు తొడుక్కున్నా

ఎర్ర టోపీ ని నేనే, తెల్ల టోపీ ని నేనే,

నల్ల కోటు ని నేనే, తెల్ల కోటుని నేనే..

వీటన్నిటిని నడిపే పచ్చ నోటునీ నేనే,

20 శతాబ్దాల చరిత్ర శిశువు ని

చరిత్ర కన్న నాగరికత అష్టావక్రను,

కాలం చెక్కిలిపై ఘనీభవించిన కన్నీటి బొట్టుని.....



|| రాసింది Oct’ 1988 లో||

Comments