|| నాక్కొంచెం నమ్మకాన్నివ్వండి......||



రాజశేఖర్ గుదిబండి(చంద్రం) || నాక్కొంచెం నమ్మకాన్నివ్వండి......||



అమ్మ నుండి ప్రాణాన్ని పంచుకొని

నాన్న నుండి దేహాన్ని పంచుకొని

మా అందరి ప్రేమని పంచుకొని

కలల్ని కన్నీళ్ళని పంచుకొని

బాల్యం ఆసుపత్రితో పంచుకొని



అమ్మనొదిలి , అమ్మ చేతి మాత్రనొదిలి

నాన్ననొదిలి , నాన్న ఒడిలో నవ్వునొదిలి

పుట్టిన గడ్డనొదిలి, మా అందరి

హృదయాల్లో చెరగని ముద్రనొదిలి

నీ ఒంటరి ప్రయాణం ఏ ఏ తీరాలకి

ఇంతటి సాహసం ఏ ఏ పోరాటాలకి

***       ***      ***

నాక్కొంచెం నమ్మకాన్నివ్వండి

ప్రేమనివ్వండి, శక్తి నివ్వండి

నాక్కొంచెం కలల్నివ్వండి

ఒడ్డున పడ్డ చేప పిల్లకి

కొంచెం కన్నీరైనా ఇవ్వండి

నా చుట్టూ మీరంతా ప్రవహించే జ్ఞాపకమవ్వండి,

నాక్కొంచెం స్ఫూర్తి నివ్వండి



జన్మనిచ్చిన అమ్మకి,

పునర్జన్మనిచ్చిన నాన్నకి

ఋణం తీర్చుకొనే అవకాశమివ్వండి

దానికి నేను పోరాటం చేయాలి

కాలంతో యుద్ధం చేయాలి

కలలతో , కన్నీళ్ళతో యుద్ధం చేయాలి

ఆశలు , ఆశయాల కోసం యుద్ధం చేయాలి

క్షణ క్షణం నన్ను నేను పునర్నిర్మించుకోవాలి

ఆయుధాల్ని చేతులు మార్చుకొనే సమయం ఇది

బాధ్యతల్ని ‘భుజాలు’ మార్చుకొనే సమయం ఇది



అవును, నేను యుద్ధం చేయాలి

దేహంతో యుద్ధం చేయాలి

అందుకు నాక్కొంచెం నమ్మకాన్నివ్వండి......



|| 26/07/2013 ||

Comments